విశాఖ రాజధాని సాధన విషయమై అందరూ కలిసి గొంతు వినిపించాల్సిన బాధ్యత ఉందని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు వీధికి ఆనుకుని ఉన్న సచివాలయ పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక సమస్యలు గుర్తించారు. వాటి పరిష్కారానికి నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖే రాజధాని అన్న నినాదం సాకారం కోసం అంతా కలిసి కట్టుగా పనిచేయాలని, అందుకు తగ్గ విధంగా ఉద్యమించాలని చెప్పారు. అంతా కలిసి రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి మాట్లాడగలిగినప్పుడే మన కలల సాధన అన్నది సాకారం అవుతుందని, ఇందుకు సాధన వీరులంతా కలిసి మున్ముందుకు అడుగులు వేయాలని చెప్పారు. అదేవిధంగా ఒకనాడు రాజధాని గా కర్నూలు, అంతకుమునుపు మద్రాసు పట్టణం, ఆ తరువాత మారిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక హైద్రాబాద్ ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డామని, కానీ ఇప్పుడు మన చెంతకే రాజధాని వస్తుంది కనుక ఈ అవకాశాన్ని అస్సలు వదులు కోవద్దని పిలుపునిచ్చారు.