విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ లో భాగంగా వైయస్ఆర్ జిల్లా కొప్పర్తిలో 1, 050. 45 హెక్టార్లలో ఏపీఐఐసీ తలపెట్టిన పారిశ్రామిక పార్కు పర్యావరణ అనుమతుల మంజూరు వాయిదా పడింది. ఈ ప్రతిపాదనలపై పరిశీలన జరిపిన నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టుపై పలు కోర్టు కేసులున్న విషయాన్ని గమనించింది. దీంతో కోర్టు కేసుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ పార్కులో కోక్ తయారీ, కోలార్ డిస్టిలేషన్, ఫ్యూయల్ గ్యాస్ తయారీ, కెమికల్, పెట్రోకెమికల్ తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారని, అయితే ఆ పరిశ్రమల వివరాలు స్పష్టంగా చెప్పలేదని పేర్కొంది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఈ పార్క్ లో ఏయే పరిశ్రమలు ఏర్పాటుచేసేదీ సవరించిన ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. ఇక్కడ రెండు సహజ సిద్దమైన రిజర్వాయర్లు ఉండగా వాటి సరిహద్దులను సరిగా గుర్తించలేదని ఆక్షేపించింది. ప్రాజెక్టు ప్రాంతంలో సహజసిద్ధమైన వాగులు, వంకలు, జలవనరులను కచ్చితంగా గుర్తించి వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకునేది చెప్పాలని పేర్కొంది. ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండానే ఏపీఐఐసీ ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపడంపై నిపుణుల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక పంపిస్తే కానీ కొప్పర్తి పారిశ్రామిక పార్క్ పర్యావరణ అనుమతులు వచ్చేలా లేవు.