ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక క్యాప్షన్ పెట్టి.. వార్త రాసి.. ఈ రాతలతో చంద్రబాబు తలరాత మార్చాలనుకోవడం చాలా దురదృష్టకరమని విద్యుత్, అటవీ, గనులు, పర్యావరణ, శాస్త్ర–సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిర్దిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ తన శాఖలో ఏదో తప్పు జరిగిపోయిందని వక్రీకరించేలా రాతలు రాయడం బాధాకరమన్నారు. కంకరకు వంకర లేదు.. నేతలకు మేత అంతకంటే లేదని ఈనాడు తప్పుడు వార్తలను కొట్టిపారేశారు. తన శాఖలో తప్పు జరిగితే పలానా చోట, పలానా వ్యక్తి చేశాడని రాస్తే బాగుంటుంది.. అదేదీ లేకుండా ప్రభుత్వం మీద బురదజల్లేలా తప్పుడు రాతలు రాయడం మంచిది కాదన్నారు. ఈనాడు రాతలను ఖండిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు.