వైద్య ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వైద్యరంగానికి చేసిన ఖర్చులో మూడు రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతున్న చికిత్సల సంఖ్య 1059 నుంచి 3,255కు పెంచుతున్నామని తెలిపారు. ఇదే రంగంలో భారీ సంఖ్యలో మునుపెన్నడూలేని విధంగా సుమారు 46వేల పోస్టులను భర్తీచేశామన్నారు. ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన సేవలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతో మంచి ఫలితాలు వస్తాయని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.