ట్విట్టర్ ఇప్పుడు తెలివైన వారి చేతుల్లో ఉండటం సంతోషంగా ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ... ట్విట్టర్ ను సొంతం చేసుకున్న మస్క్ కు అభినందనలు తెలిపారు.
'ట్విట్టర్ ఇప్పుడు తెలివైన వారి చేతుల్లో ఉండటం సంతోషంగా ఉంది. మన దేశాన్ని ద్వేషించే రాడికల్ ఉన్మాదుల చేతిలో ఇక నుంచి ట్విట్టర్ ఉండదు' అని ట్రంప్ అన్నారు. మరోవైపు ట్రంప్ పై గతంలో ట్విట్టర్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తామనే దిశగా ఎలాన్ మస్క్ సంకేతాలను ఇచ్చారు. అయితే, తాను మళ్లీ ట్విట్టర్లోకి వచ్చే అంశంపై మాత్రం ట్రంప్ ఏ మాత్రం స్పందించలేదు. అయితే ఆయన ఒక ఆసక్తికర వ్యాఖ్య మాత్రం చేశారు. తాను లేకుండా ట్విట్టర్ విజయవంతం అవుతుందని తాను భావించడం లేదని అన్నారు.
మరోవైపు ట్విట్టర్ తనపై నిషేధం విధించిన తర్వాత 'ట్రూత్' పేరుతో ట్రంప్ సొంతంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ట్విట్టర్ లో ఉన్నప్పుడు ఆయనకు 80 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉండగా... ట్రూత్ లో 4 మిలియన్ల మంది ఉన్నారు. ట్రూత్ కు ఎక్కువ మంది యూజర్స్ లేకపోవడమే దీనికి కారణం.