ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మస్క్ కు కంటిగింపుగా మారిన భారతీయుడు

international |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 11:12 PM

ట్విట్టర్ ను అనివార్యంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొన్నారా...? ఆయన కొన్నాల్సివచ్చిందా అన్న చర్చ కూడా అక్కడక్కడా సాగుతోంది. ఇదిలావుంటే 38 ఏళ్ల వయసుకే ట్విట్టర్ సీఈవోగా పగ్గాలు చేపట్టి భారతీయ ప్రతిభా పాటవాలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి పరాగ్ అగర్వాల్. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత మొదటి రోజే మొదటి గంటలోనే పరాగ్ అగర్వాల్ ను సంస్థ నుంచి బయటకు గెంటేశారు. ట్విట్టర్ లో 2011లో ఇంజనీర్ గా చేరిన పరాగ్ ప్రతిభతో ఎదిగాడు. 2017 లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయిన తర్వాత సంస్థ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు. అంతటి ప్రతిభ ఉన్నందునే ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తాను తప్పుకుని సీఈవోగా బాధ్యతలను యువకుడైన పరాగ్ అగర్వాల్ కు అప్పగించాడు. ఇదంతా ఒక ఎపిసోడ్.


ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా అధినేతగా ప్రపంచంలో కుబేరుడైన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ కొనుగోలు చేయాలనుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసే సామాజిక మాధ్యమాలు కొన్నే ఉన్నాయి. అందులో ట్విట్టర్ ఒకటి. పైగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలు, సెలబ్రిటీలు ఉన్న అరుదైన వేదిక ట్విట్టర్. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ అన్నవి మెటాకు చెందినవి. కనుక వాటిని కొనుగోలు చేసే అవకాశం లేదు. ట్విట్టర్ కు ఉన్న ఈ ప్రత్యేకత, భవిష్యత్ అవకాశాలు మస్క్ కు తెగ నచ్చాయి. అందుకే 44 బిలియన్ డాలర్లు ( రూ.3.6 లక్షల కోట్లు) వెచ్చించి కొనుగోలుకు ముందుకు వచ్చారు. మస్క్ సంపద 223 బిలియన్ డాలర్లు (రూ.18.28 లక్షల కోట్లు). ఇందులో ట్విట్టర్ కొనుగోలుకు వెచ్చిస్తున్నది 20 శాతమే.


ట్విట్టర్ కొనుగోలుకు డీల్ చేసుకున్న మస్క్.. ఎందుకో గానీ ఆ తర్వాత పునరాలోచనలో పడిపోయారు. మస్క్ చాలా ఎక్కువ పెట్టి ట్విట్టర్ కొంటున్నారంటూ నిపుణుల నుంచి అభిప్రాయాలు వినిపించాయి. పైగా అసలు మస్క్ ఈ కంపెనీని నడిపించడం కష్టమైన పనేనన్న విశ్లేషణలు సైతం వచ్చాయి. దీంతో మస్క్ కొంత ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. 


ట్విట్టర్ లో బాట్ ఖాతాలు, స్పామ్ ఖాతాలు ఎక్కువ ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు మస్క్. ఈ సమాచారం తనతో పంచుకోలేదంటూ కొనుగోలు డీల్ నుంచి తప్పుకోవాలని చూశారు. కానీ, ట్విట్టర్ యాజమాన్యం మస్క్ ఆరోపణలను అంగీకరించలేదు. మస్క్ ఏకపక్షంగా తాను కొనుగోలు డీల్ ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం కోర్టుకెక్కింది. ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీంతో కోర్టు సైతం ఇందుకు గడువు విధించింది. ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా కోర్టులో వ్యవహారాలు నడిపించడంలో కీలకంగా వ్యవహరించింది భారతీయులైన పరాగ్ అగర్వాల్ తో పాటు, ట్విట్టర్ లీగల్ హెడ్ గా అప్పటి విజయ గద్దె!


మస్క్ చేతికి ట్విట్టర్ వెళితే తన పదవి ఊడుతుందని పరాగ్ అగర్వాల్ కు తెలుసు. కానీ, ఇక్కడ స్వలాభం కన్నా.. సంస్థ వ్యవస్థాపకులు, వాటాదారులకు మెరుగైన విలువ తీసుకురావడమే సీఈవోగా తన కర్తవ్యమని భావించారు అగర్వాల్. న్యాయపరంగా ట్విట్టర్ గెలిచే అవకాశాలున్నాయన్నది నిపుణుల అంచనా. న్యాయ నిపుణులు మస్క్ కు ఇదే విషయం చెప్పారు. దీంతో తెలివైన వాడని అనిపించుకునే మస్క్ దీనికి మొదట్లోనే ముగింపు పలికే విధంగా అడుగులు వేశారు. ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. 


తనతో బిందెడు నీళ్లు తాగించి, ట్విట్టర్ కొనుగోలు చేసేలా వ్యవహరించిన వారిని మొదటి రోజే సంస్థ నుంచి బయటకు పంపించేశారు. కానీ, గెలిచింది న్యాయం, భారతీయుడే. ట్విట్టర్ టేకోవర్ వ్యవహారంలో మస్క్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా గొడవ పడినందునే పరాగ్ ఉద్వాసనకు గురికావాల్సి వచ్చిందని సాక్షాత్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొనడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com