నేడు ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు తమ సత్తాను చాటుతున్నారు. ఇటీవల రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. ఓ భారత సంతతి నేత బ్రిటీష్ ప్రధానమంత్రి కావడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కీలక పదవులు నిర్వహిస్తున్న భారత సంతతి వ్యక్తులపై చర్చ మొదలైంది. అమెరికాలో ప్రవాస భారతీయుల కోసం పనిచేసే ఓ సంస్థ దీనిపై ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో వివిధ పదవులు నిర్వహిస్తున్న భారత సంతతి నేతల జాబితాను వెల్లడించింది. 15 దేశాల్లో 200 మంది వరకు భారత సంతతి నేతలు ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్నారని పేర్కొంది. వీరిలో ఆరుగురు దేశాధినేతలు అని తెలిపింది.
రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), మహ్మద్ ఇర్ఫాన్ అలీ (గయానా అధ్యక్షుడు), ఆంటోనియో కోస్టా (పోర్చుగల్ ప్రధానమంత్రి), ప్రవింద్ జగన్నాథ్ (మారిషస్ ప్రధాని), పృథ్వీరాజ్ సింగ్ రూపన్ (మారిషస్ అధ్యక్షుడు), చంద్రికా ప్రసాద్ శాంటోకీ (సురినామ్ అధ్యక్షుడు) భారత మూలాలు ఉన్న వ్యక్తులు అని సదరు సంస్థ వెల్లడింది. ఇక, డిప్యూటీ నేతలుగా కమలా హారిస్ (అమెరికా ఉపాధ్యక్షురాలు), భరత్ జగదేవ్ (గయా ఉపాధ్యక్షుడు), లియో వరాద్కర్ (ఐర్లాండ్ ఉపాధ్యక్షుడు)ల పేర్లను పేర్కొంది. వీరే కాకుండా 55 మంది భారత సంతతి నేతలు క్యాబినెట్ మంత్రులుగానూ, 63 మంది ఎంపీలుగానూ సేవలందిస్తున్నారని తెలిపింది. అంతర్జాతీయ రాయబారులగా 10 మంది, ఇద్దరు కాన్సులేట్ జనరళ్లుగా వ్యవహరిస్తున్నారని వెల్లడించింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోనూ భారత సంతతివారు నాయకులుగా ఉన్నట్టు తెలిపింది. రాజకీయాల సంగతి అటుంచితే, ప్రపంచవ్యాప్తంగా ఒక్క అమెరికాలోనే 112 మంది భారతీయ మూలాలున్న వారు వివిధ రంగాల్లో పదవులను చేపట్టారు. ఇక, మారిషస్, ఫిజి, సింగపూర్, సురినామ్ దేశాల్లో చీఫ్ జస్టిస్ లు భారత సంతతివారే. అమెరికాలోని పలు సర్క్యూట్ కోర్టుల్లోనూ భారత సంతతి వ్యక్తులు జడ్జిలుగా నియమితులయ్యారు. అంతేకాదు, ఫిజి, గయానా, సింగపూర్, మారిషస్ దేశాల కేంద్రీయ బ్యాంకుల అధిపతులుగా భారత సంతతి వారే సేవలందిస్తున్నారు.