దేశ వ్యాప్తంగా పాల ధరలు ఇటీవల పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ‌్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1వ తేదీ నుంచి విజయ పాల ధరలు పెరుగనున్నాయి. విజయ ఫుల్ క్రీమ్, గోల్డ్ పాల ధర లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ఆదివారం ప్రకటించింది. నవంబర్ 1 నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం విజయ ఫుల్ క్రీమ్ అర లీటర్ ప్యాకెట్ ధర రూ.34 ఉండగా రూ.35కి పెరగనుంది. అలాగే, విజయ గోల్డ్ ప్యాకెట్ అర లీటర్ ప్యాకెట్ ధర రూ. 35 ఉండగా, నవంబర్ 1 నుంచి రూ.36కి విక్రయిస్తామని తెలిపింది.
రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్ ధర, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే పాల ధరలను పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ వెల్లడించింది. అయితే, పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం కాస్త ఊరట కలిగించే విషయం చెప్పింది. పేద, మధ్య తరగతి వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే లో ఫ్యాట్ (డీటీఎం), ఎకానమీ (టీఎం), ప్రీమియం (ఎస్‌టీడీ) పాల ధరల్లో ఎలాంటి మార్పు లేదని కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు వెల్లడించారు.
పాలు, పాల పదార్థాలకు సంబంధించిన ముడిసరుకులకు ఇతర దేశాల నుంచి ఎక్కువ డిమాండ్ ఉందని.. దీంతో మన దేశంలోని కొన్ని రాష్ట్రాల నుంచి సేకరిస్తున్న పాలు, పాల పదార్థాల ముడి సరకుల ధరలు పెరిగాయని కొల్లి ఈశ్వరబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయ సంస్థకు చెందిన గోల్డ్, స్పెషల్ (ఎంఎం) ధరలు పెంచక తప్పలేదన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.