ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 12:02 AM

 


ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పలు ప్రశ్నలతో సవాల్ విసిరారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తాము వేసే 10 ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి నిర్ధోషినని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను  పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. వివేకా హత్య ఉదంతంపై ప్రజల్లో నెలకొన్న పలు అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. ఈ మేరకు జగన్ పై పట్టాభి ప్రశ్నల వర్షం కురిపించారు. 


టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మేం వేసే 10 ప్రశ్నలు తనకు టీడీపీ ఇచ్చిన  బంపర్ ఆఫర్ గా భావించాలని జగన్ ను కోరారు. ప్రపంచమంతా సోషల్ మీడియాలో ‘‘అబ్బాయ్ కిల్డ్ బాబాయ్’’ అనే హ్యాష్ ట్యాగ్ లతో పోస్టింగులు హల్ చల్ చేస్తుంటే వాటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేలుకుట్టిన దొంగలా ఎందుకు నోరెత్తడంలేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మూడున్నరేళ్లుగా సమాధానాల కోసం  రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. 


"రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగనాసురుడుగా కనిపిస్తున్నారు. బాబాయ్ హత్య కేసులో తన ప్రమేయం ఉంది గనుకనే కేసు విచారణకు అడ్డుపడుతున్నారని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. జగన్ రెడ్డికి వివేకా హత్యతో సంబంధం లేకుంటే...తాను నిర్ధోషి అని నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. తాము అడిగే పది ప్రశ్నలకు సమాధానం చెప్పి... తనను తాను నిర్ధోషినని జగన్ రెడ్డి నిరూపించుకోవాలి. 


దీనికి ఆయన 10 నిమిషాలు లేదా 10గంటలు, లేదా 10రోజులైనా సమయం తీసుకోవచ్చు. జగన్ కు ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే ధైర్యం లేకపోతే తన జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డినైనా తెచ్చుకోవచ్చు. తనతో సమాధానం చెప్పించి తనను తాను నిర్ధోషి అని నిరూపించుకోవాలి అని స్పష్టం చేశారు.


ఆ పది ప్రశ్నలు ఇవే... 


1. వివేకా హత్య జరిగిన సంఘటనా స్థలానికి జగన్ సతీమణి భారతీరెడ్డి కుటుంబ సభ్యులే అందరికంటే ముందుగా 3 నిమిషాల్లోనే ఎందుకు వెళ్లారు? ఎలా వెళ్లారు? ఏం చేయడానికి వెళ్లారు? వాళ్లు వెళ్లిన పది నిమిషాలకే సాక్షి ఛానల్ లో మీ విలేకరి మోపూరి బాలకృష్ణారెడ్డితో వివేకా గుండెపోటుతో మరణించారని బ్రేకింగ్ న్యూస్ ఎందుకు వేయించారు?


2. మీ మామ ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేసే గజ్జల జయ ప్రకాష్ రెడ్డి వచ్చి వివేకానందరెడ్డి శరీరంపై ఉన్న గాయాలకు కుట్లు వేశారా, లేదా? దీని గురించి ఎప్పుడైనా మీ మామను, నీ భార్య భారతీరెడ్డిని అయినా అడిగావా?


3. మీరు సీఎం అయిన రెండు వారాల్లోనే 13-06-2019న అడిషనల్ డీజీ స్థాయిలో నడుస్తున్న సిట్ ను నిర్వీర్యం చేసి, కేవలం ఎస్పీ స్థాయి అధికారితో సిట్ ఎందుకు వేశారు? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి?


4. మీరు సీఎం అయిన నెలరోజుల్లోపే  వివేకా హత్యకేసులో నిందితుడు ఏ-1 ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది? మీరు సీఎం అయ్యాక ఎర్ర గంగిరెడ్డిపై చార్జిషీటు ఎందుకు వేయలేదు? గంగిరెడ్డికి బెయిల్ ఇప్పించడం కోసమే చార్జిషీటు వేయలేదనేది నిజం కాదా?


5. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మరియు గజ్జల జయప్రకాష్ రెడ్డి కుమారుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారి అభిషేక్ మహంతి విచారించేందుకు 02-09-2019న కడప తీసుకెళ్తుంటే నీ ప్యాలెస్ నుండి మహంతికి ఫోన్ ఎందుకు వెళ్లింది? మార్గం మధ్యలోనే ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు వదిలిపెట్టారు? అభిషేక్ మహంతిని సుదీర్ఘ సెలవులపై ఎందుకు పంపారు? ఎవరిని కాపాడడం కోసం ఇదంతా చేశారు జగన్?


6. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టును సునీత పిటిషన్ ద్వారా 24-01-2020న కోరింది. ఇది జరిగిన రెండు వారాల్లోనే 06-02-2020న గతంలో సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో మీరు వేసిన పిటిషన్ ను ఆఘమేఘాల మీద మీరు ఎందుకు ఉపసంహరించుకున్నారు? సీబీఐ విచారణ జరిగితే నీ బండారం బయటపడుతుందనా?


7. వివేకా హత్య కేసులో కీలక సాక్షి అయిన సీఐ శంకరయ్య సీబీఐకి 164 సీఆర్పీసీ ద్వారా అవినాష్ రెడ్డి ముఠా సాక్ష్యాలు రూపుమాపు చేసిన వ్యవహారంపై వాంగ్మూలం ఇచ్చి, ఆ తర్వాత మీ ఒత్తిడితో ప్లేటు ఫిరాయించిన వారం రోజుల్లోనే అప్పటి వరకు సస్పెన్షన్ లో ఉన్న శంకరయ్యపై సస్పెన్ష్ ఎత్తివేసి, అతనికి తిరిగి పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు? శంకరయ్య సీబీఐకి ఎదురుతిరిగినందుకా?


8. వివేకా హత్య కేసులో కీలక సాక్ష్యులు కె శ్రీనివాసరెడ్డి(02-09-2019), గంగాధర్ రెడ్డి(09-06-2022) అనుమానాస్పద మృతి వెనుక జరిగిన కుట్ర ఏంటి? వీళ్ల మరణంపై మీ ప్రభుత్వం ఏమైనా విచారణ చేసిందా? పరిటాల రవి హత్యకేసులో నిందితులను, సాక్ష్యులను చంపినట్టే వీళ్లను కూడా చంపేశారా?


9. ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి(భారతీరెడ్డి పెదనాన్న కుమారుడు)ని డాక్టర్ వైఎస్ ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీకి రిజిస్ట్రార్ గా ఎందుకు నియమించారు? వివేకా హత్యానంతరం సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డికి సహకరించినందుకు ఈ పదవి నజరానాగా ఇచ్చారా?


10. వివేకా హత్యకేసులో ఏ-4 శివశంకర్ రెడ్డిని మీరు అనేక రకాలుగా కాపాడడం లేదా? ఆఖరికి ఇతన్ని కడప జైల్లో సీబీఐ రిమాండ్ లో పెడితే కోర్టు అనుమతి లేకుండా అతనిని కడపలోని రిమ్స్ ఆసుపత్రికి మీరు తరలించి సకల సౌకర్యాలు కల్పించింది నిజం కాదా? శివశంకర్ రెడ్డిపై మీకు ఎందుకు అంత ప్రేమ?


 ఈ పది ప్రశ్నలకు టకటకా సమాధానం చెప్పి...అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అనే మచ్చను తొలగించుకుంటారా, లేక వివేకా హత్యతో తనకు సంబంధం ఉందని ఒప్పుకుంటారా? అని పట్టాభి జగన్ రెడ్డిని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com