మా పాఠశాల విలీనం రద్దు చేయండి.. మా పిల్లల్ని అంతదూరం పంపలేం.. అంటూ విచారణకు వచ్చిన డిప్యూటీ డిఈవో భిక్షాలు కు శనివారం మనుబోలు అంబేడ్కర్ నగర్ దళితులు తెగేసి చెప్పారు. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విలీనం తీసుకువచ్చినప్పటి నుంచి మనుబోలులోని అంబేడ్కర్ నగర్ దళితులు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశారు. అయినప్పటికీ అధికారులు అంబేడ్కర్ నగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతుల విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఉన్నత పాఠశాలకు వెళ్లాలని సూచించారు. అయితే కేవలం ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన పిల్లలు ఆ పాఠశాలకు వెళ్లలేదు. ఈ క్రమంలో తమ కాలనీలో ఉన్న పాఠశాలను విలీనం నుంచి తప్పించాలని కాలనీకి చెందిన అడపాల ప్రేమ్‌కుమార్‌తో పాటు కాలనీవాసులు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని డిఈవో రమే్‌షకు ఆదేశాలు అందాయి. ఆయన నెల్లూరు డిప్యూటీ డిఈవో భిక్షాలును విచారణాధికారిగా నియమించారు. ఆయన శనివారం కాలనీవాసులను పాఠశాలకు పిలిపించి విచారణ చేపట్టారు. విలీనానికి ఒప్పుకోమని, విలీనం రద్దు చేయకపోతే తమ పిల్లలను చదువులు ఆపేస్తామని బదులిచ్చారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని, వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంఈవో జ్ఞానప్రసూన, ఎంఐఎస్ కో-ఆర్టినేటర్ ఆదిశేషయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.