జగన్ రెడ్డి పాలనలో మొదటి నెల నుంచే ప్రజలపై భారాలు మోపుతూ వచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విమర్శించారు. నాటి నుంచే జగన్ రెడ్డి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్విరామంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలపై విపరీతంగా బాదుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ప్రజలపై ఎలాంటి ఛార్జీల భారం మోపలేదని, ఒక్క నిమిషం కూడా కరెంట్ కోతలు లేవని వెల్లడించారు. కానీ,
ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలను పరిశీలిస్తే, ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపుతున్నారని పట్టాభిరాం వివరించారు. విద్యుత్ ప్లాంట్లను సరిగా నిర్వహించకపోవడం, బొగ్గు కొనుగోళ్లలో అసమర్థత, ప్రభుత్వ అధీనంలోని ఏపీ జెన్ కో విద్యుత్ ప్లాంట్లలో సరిగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడం, పీపీఏల రద్దు వంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.
బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 వరకు కూడా పెట్టి విచ్చలవిడిగా విద్యుత్ కొనుగోలు చేశారని, ఈ అదనపు కొనుగోలు భారాన్నంతా ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోపుతున్నారని వెల్లడించారు. "భారాలు మోపే విషయంలోనూ జగన్ రెడ్డి రివర్స్ లో వెళ్లారు. 2014-19 మధ్య కాలానికి కూడా ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. చంద్రబాబు పాలనలో ప్రజలపై పైసా భారం వేయలేదు. ట్రూ అప్ అనే పదానికే చోటివ్వలేదు. చంద్రబాబు పాలనా కాలానికి ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీలు వేయడం ఏంటి? ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. పోనీ రివర్స్ లో వెళ్లి టీడీపీ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కూడా ఇదేరకంగా మీరు కొనసాగించారా?" అంటూ పట్టాభిరాం నిలదీశారు.
ఈ ట్రూ అప్ ఛార్జీల వడ్డనకు ప్రధాన కారణం థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యానికి తగట్లు లేకపోవడమేనని వెల్లడించారు. ఆ లోటు పూడ్చుకోవడానికి బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం మరో కారణమని వివరించారు. చంద్రబాబు ముందుచూపుతో బొగ్గు కోసం ఏపీఎండీసీ ద్వారా మధ్యప్రదేశ్ లో సులియారి కోల్ మైన్ ను తీసుకోవడం జరిగింది. ఇవాళ అదే కోల్ మైన్ అదానీ వాళ్లకు కట్టబెట్టడం జరిగింది. ఇదే సులియారి బొగ్గుగని ఏపీ జెన్ కోకు ఇచ్చివుంటే రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత ఉండేది కాదు. కావాల్సినంత విద్యుత్ ఉత్పాదన జరిగి ఉండేది. బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరలకు కొనాల్సిన పరిస్థితి ఉండేది కాదు.
అదే బొగ్గుగని రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండి ఉంటే తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు మనకు అందుబాటులో ఉండి ఉండేది. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ ను అమ్మాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేది కాదు. అన్నీ తెలిసే జగన్ రెడ్డి తన స్వలాభం కోసం లాలూచీ పడి ఇతరులకు ఈ విధంగా దోచిపెడుతున్నారు. ప్రజలు ఈ వాస్తవాలన్నీ దయచేసి గ్రహించాలి" అన్నారు పట్టాభిరాం.