పేదలు సహా అల్పాదాయవర్గాలకు ప్రభుత్వ సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి వస్తోంది అని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... సర్కారు నుంచి సొమ్ము ప్రజానీకానికి అందడానికి గతంలో దళారులు, లంచాల పాత్ర కనిపించేది. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సామాన్యుడికి సంక్షేమ పథకాల వల్ల ప్రత్యక్షంగా మేలు చేయాలనే ఐడియా వచ్చింది. అందుకు సర్కారు నుంచి డబ్బు వారి అకౌంట్లలో వేయడమే మేలని గుర్తించారు. ఆధునిక సమాచార సాంకేతికత (ఐటీ)తో నడిచే ఈ పద్ధతిని అదివరకు ప్రభుత్వాలు చాలా తక్కువగా అనుసరించాయి. ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో అన్ని విధాలా ఆర్థికంగా కుంగిపోయిన సామాన్యులను ఆదుకోవడమే జగన్ సర్కారు ప్రధాన అజెండా అయింది. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన సవరత్నాలు సహా అనేక సంక్షేమ పథకాల అమలుకు కొత్త విధానం అక్కరకొచ్చింది. పేదలకు నేరుగా మేలు చేసే నగదు బదిలీ పద్ధతిని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రధాన సాధనంగా మార్చుకుంది. దివంగత జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు– దేశంలోనే మొదటిసారి స్మార్ట్ కార్డ్ పద్ధతి ద్వారా పేదలకు ఉపాధి హామీ పథకం కింద నగదు పంపిణీకి 2006లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకారం చుట్టారు. ఈ నగదు బదిలీ లేదా ప్రత్యక్ష మేలు బదిలీ (డీబీటీ) విధానాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం అనేక స్కీములకు విస్తరించింది అని తెలియజేసారు.