ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట ఏర్పాటులో ఎంతో చరిత్ర ఉంది. ప్రాణత్యాగం, పట్టు విడువని పోరాటం కారణంగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే ఆశయంతో హైదరాబాద్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. 1956 నవంబర్ 1న తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ అవతరణను నవంబర్ 1న నిర్వహిస్తూ వచ్చారు. అయితే 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై గందరగోళం ఏర్పడింది. నవంబర్ 1వ తేదీనే రాష్ట్రావతరణ దినోత్సవంగా ప్రస్తుత ప్రభుత్వం పాటిస్తోంది. ఈ ప్రత్యేక దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కీలక విషయాలు తెలుసుకుందాం.
ఒకప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భాగంగా ఉండేది. ఆ సమయంలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. అన్ని విషయాలలోనూ తమిళుల ఆధిపత్యం కొనసాగేది. క్రమేపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే బలీయమైన కాంక్ష ఆంధ్రులలో ఏర్పడింది. 1912 మేలో నిడదవోలులో జరిగిన సదస్సు, 1913 మే 20న గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభ ఈ ప్రత్యేక రాష్ట్ర భావనను మరింత బలపర్చాయి. 1914లో విజయవాడలో నిర్వహించిన రెండవ ఆంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం తీర్మానం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ మరింత వెనుకపడుతుందనే భావన ఆ ప్రాంత నేతల్లో ఏర్పడించి. ఎన్నో చర్చల తర్వాత రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రంలో కల్పించే ప్రయోజనాలతో 1937 నవంబరు 16న శ్రీబాగ్ ఒడంబడిక కుదిరింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆంధ్రులు ఆరంభశూరులు అనే నానుడికి తెరదించుతూ, మద్రాసుతో కూడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 - 1952 డిసెంబరు 15) దీక్ష చేపట్టారు. మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్షను ఆయన ప్రారంభించారు. 1952 డిసెంబరు 15న ఆయన ప్రాణత్యాగం చేశారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున ఉద్యమం ఏర్పడింది. ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలి, హింసాత్మక ఆందోళనలు జరిగాయి. దీంతో లోక్‌సభలో 1952 డిసెంబర్ 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి ప్రధాని నెహ్రూ ప్రకటించారు.
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలు రాజధానిగా 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలంగాణ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడడంతో 2014లో టీడీపీ ప్రభుత్వం జూన్ 2న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ప్రకటించింది. అయితే 2019లో ముఖ్యమంత్రి అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో జరుపుకున్న విధంగానే నవంబరు 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయింది.