మీరు చెల్లించే మొత్తానికంటే ఎక్కువ విలువైన సేవలు పొందుతారని ట్విట్టర్ యాజమాని ఎలాన్ మస్క్ హామీ ఇచ్చారు. ట్విట్టర్ లో బ్లూ టిక్ ఫీజు పెంపుపై విమర్శలకు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఫన్నీగా జవాబిచ్చారు. బ్లూ టిక్ కోసం నెల నెలా 8 డాలర్లు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పిన మస్క్.. మీరు చెల్లించే మొత్తానికంటే ఎక్కువ విలువైన సేవలు పొందుతారని హామీ ఇచ్చారు. అదేసమయంలో 30 నిమిషాలలో పూర్తిచేసే స్టార్ బక్స్ కాఫీకి 8 డాలర్లు ఖర్చుచేయడానికి వెనకాడనప్పుడు నెల రోజులకు ట్విట్టర్ కు అంతే మొత్తం చెల్లించాలంటే ఎందుకు విమర్శిస్తున్నారని అర్థం వచ్చేలా ఉన్న మీమ్ ను ట్వీట్ చేశారు. ఇంటర్నెట్ లో అత్యంత ఆకర్షణీయమైంది ట్విట్టర్ అని, అందుకే ఇప్పుడు మీరీ ట్వీట్ చూస్తున్నారని మస్క్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
బ్లూ టిక్ ఫీజు పెంపుపై మస్క్ వివరణ ఇస్తూ.. నెలనెలా 8 డాలర్లు చెల్లించడం ద్వారా ట్విట్టర్ లో వెరిఫైడ్ అకౌంట్లకు ఇచ్చే బ్లూ టిక్ బ్యాడ్జిని కలిగి ఉండొచ్చని, స్పామ్ సందేశాల గొడవ ఉండదని చెప్పారు. ప్రకటనల విషయంలోనూ వెరిఫైడ్ ఖాతాలకు మిగతా వారికి లేని ప్రయోజనాలు కల్పిస్తామని మస్క్ వివరించారు. సాధారణ ఖాతాదారులతో పోలిస్తే బ్లూ టిక్ యూజర్లు సగం ప్రకటనలు మాత్రమే చూస్తారని మస్క్ తెలిపారు.