టెక్నాలజీతో దేశంలోని అన్ని సేవలు ఎంత సులువుగా మన గడపవద్దకు వస్తున్నాయో అంతే తేలికగా మనం సైబర్ మోసగాళ్ల వలకు చిక్కుతున్నాం. టెక్నాలజీ, డిజిటల్ సాధనాల పట్ల సరైన అవగాహన లేకపోతే ఎంతటి వారైనా మోసపోక తప్పదని ఈ ఘటన రుజువు చేస్తోంది. సైబర్ నేరస్థులు లాయర్ నే నిండా ముంచిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన ఓ లాయర్ కు ఆల్కహాల్ అలవాటు ఉంది. దీంతో ఒక రోజు తన ఇంటికి బీర్ తెప్పించుకోవాలని.. సమీపంలో వైన్ షాపులు ఎక్కడున్నాయో ఫోన్ లో సెర్చ్ చేశాడు. డోర్ డెలివరీ సర్వీస్ కోసం శోధించాడు. అందులో కనిపించిన ఓ నంబర్ కు చాలా సార్లు కాల్ చేసినప్పటికీ అటువైపు నుంచి స్పందన లేదు. కాల్ కట్ చేశాడు. కొద్ది సేపటికే ఫోన్ కు ఎస్ఎంఎస్ వచ్చింది. తాను వైన్ షాపు యజమాని అని అందులో పేర్కొని, వాట్సాప్ లో ఆర్డర్ చేయాలని సూచించాడు.
దీంతో సదరు న్యాయవాది వైన్ షాపు ఓనర్ చెప్పిన వాట్సాప్ నంబర్ కు ఓ బీర్ కావాలంటూ ఆర్డర్ చేశాడు. ఇంటికి డెలివరీ ఇవ్వడానికి కనీసం రెండు బీర్లు ఆర్డర్ చేయాలని (రూ.360), దీనికి రూ.30 డెలివరీ చార్జీ కూడా చెల్లించాలని కోరాడు. తాను పంపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించాలని కోరాడు. స్కాన్ చేయడం ఆలస్యం, రూ.499, రూ.4,999 చొప్పున రెండు సార్లు లాయర్ ఖాతా నుంచి డెబిట్ అయింది. దీంతో లాయర్ ఏదో తేడా జరిగిందని అనుమానించి తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. దీనికి అవతలి వ్యక్తి మరో విడత క్యూఆర్ కోడ్ పంపించి స్కాన్ చేయాలని కోరాడు. అప్పుడు రూ.44,782 డెబిట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత లాయర్ కాల్స్ కు అవతలి వైపు నుంచి స్పందన లేదు.