త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో దేశంలోని అన్ని పార్టీలు ఆ దిశగా సమాయత్తమవుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత సంక్షోభంతో కొట్టిమిట్టాడుతోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువ నాయకుడు సచిన్ పైలట్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల ఓ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి గెహ్లాట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించడం దానిపై పైలట్ చేసిన వ్యాఖ్యలు ఇరు వర్గాల మధ్య చిచ్చు రేపాయి. ప్రధాని మోదీ.. గెహ్లాట్ ను పొగిడిన విషయాన్ని సచిన్ పైలట్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత ఆజాద్‌తో ముడిపెట్టారు. గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సమయంలో మోదీ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఇది కాంగ్రెస్ నేతలకు రుచించలేదు. ఈ క్రమంలో చివరికి ఆజాద్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి సొంత పార్టీని స్థాపించారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీ.. గెహ్లాట్ ను ప్రశంసించిన తర్వాత ఆజాద్ ను సచిన్ పైలట్ గుర్తు చేశారు. ‘ప్రధానమంత్రి నిన్న సీఎంను ప్రశంసించడం ఆసక్తికరంగా ఉంది. దీన్ని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే పీఎం కూడా పార్లమెంటులో గులాం నబీ ఆజాద్‌ను ప్రశంసించారు. దాని తర్వాత ఏం జరిగిందో మేమంతా చూశాము‘ అని సచిన్ వ్యాఖ్యానించడం దుమారం రేగింది. అలాగే, సెప్టెంబర్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశాన్ని బహిష్కరించి గెహ్లాట్ బల నిరూపణలో పాల్గొన్న రాజస్థాన్ నేతలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరారు.
పైలట్ ప్రకటనలపై గెహ్లాట్ స్పందిస్తూ.. ‘ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. పార్టీ నాయకులు ఇలాంటి ప్రకటనలు చేయవద్దని కోరారు. మేము కూడా నాయకులంతా క్రమశిక్షణకు కట్టుబడాలని కోరుకుంటున్నాం. రాజస్థాన్‌లో మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంపైనే పార్టీ దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం’ అని పైలట్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలా అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ఇరువురు కీలక నేతల మధ్య విభేదాలను పరిష్కరించడం కాంగ్రెస్ కొత్త అధినేత మల్లికార్జున ఖర్గేకు ఇప్పుడు సవాల్ గా మారింది.