ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు పదవీ బాధ్యతలు చేపట్టారు. మొన్నటిదాకా ఈ పదవిలో కొనసాగిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్...పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవిలో విజయబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు పదవీ బాధ్యతలు చేపట్టారు. గురువారంనాడు ఈ కార్యక్రమానికి తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఉభయ భాషా ప్రవీణులుగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు. తెలుగు అకాడమీ, ప్రెస్ అకాడమీల తోడ్పాటుతో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో తెలుగును పాలనా భాషగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడతానన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు సహాయంతో తెలుగు భాషాభివృద్ధికి ప్రయత్నిస్తానన్నారు. న్యాయస్థానాల్లో సైతం తెలుగులో వాదనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.