పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు నెలల్లో ఒక పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు ఇప్పించగలిగామంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టెక్ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ, ఆశీష్.. మంత్రులు గుడివాడ అమర్ నాధ్,తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్ రామ్ , అనురాధ,వంగా గీతా, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు.