గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కేందుకు ఒక్కోక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఓ మహిళా ఓ మహాఉపకార్యనికి శ్రీకారం చుట్టి గిన్నిస్ రికార్డు ఎక్కింది. ఏడు నెలల్లో 1,400 చిన్నారులకు తల్లిపాలను దానం చేసి లిమ్కా బుక్‌లోకి చేరారు ఓ మహిళ. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన సింధు మోనిక (29) గతేడాది జులై నుంచి ఈ ఏప్రిల్ మధ్య 42,000 ఎంఎల్ (42 లీటర్లు )తల్లిపాలను దానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నవజాత శిశు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు అందజేశారు. దీంతో మోనిక పేరు ఆసియన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అయితే, తన భర్త ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమయ్యిందని, ఆయన మద్దతుగా నిలిచారని ఆమె అన్నారు.
‘‘ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన నా భర్తకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’’ అని పేర్కొన్నారు. మోనిక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కాగా.. ఆమె భర్త మహేశ్వరన్ కోయంబత్తూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరికి వెన్‌బా అనే 18 నెలల చిన్నారి ఉంది. ‘‘నా బిడ్డకు పాలను ఇచ్చిన తర్వాత అమృతం అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన రూప సెల్వనాయకి సూచనల మేరకు తల్లి పాలను సేకరించి భద్రపరిచాను.. ఎన్జీవో ప్రతివారం పాలను సేకరించి కోయంబత్తూరులోని బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుకు అప్పగించింది’’ అని మోనిక తెలిపారు.
రూప సెల్వనాయకి మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనారోగ్యం, తల్లిపాలు లేని నవజాత శిశువులకు ఫీడింగ్ ఇవ్వడం కోసం రెండేళ్ల కిందట చొరవ తీసుకుని ప్రారంభించాను.. ఇప్పుడు, మా దగ్గర దాదాపు 50 మంది మహిళలు నమోదు చేసుకున్నారు.. వారిలో 30 మందికి పైగా తల్లి పాలను ప్రస్తుతం దానం చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. దాతలు ఇచ్చిన తల్లిపాలను అనాథలు లేదా రొమ్ముపాలు ఇవ్వలేని బాలింతల శిశువులకు అందజేస్తున్నామని రాష్ట్ర చైల్డ్ హెల్త్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసన్ అనన్ారు.
దేశవ్యాప్తంగా కేవలం 70 బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు ఉండగా.. అందులో ఒక్క తమిళనాడులోనే 45 ఉండటం చెప్పుకోదగ్గ అంశం. మొత్తం 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి.. మిగతా 10 తాలూకా ఆస్పత్రుల్లో నెలకొల్పామని ఆయన తెలిపారు. 2016 మార్చిలో తొలి మదర్ మిల్క్ బ్యాంకును మదురై ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటుచేశారు.