రైలు నుంచి రెండు బోగీలు వీడిపోగా ప్రయాణికుల ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకొంది. కొంచెంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వేగంగా దూసుకెళ్తున్న రైలు నుంచి సడన్‌గా రెండు బోగీలు విడిపోయాయి. ఇది చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు జరిగింది. నడుస్తున్న రైలు నుంచి విడిపోయి.. రెండు బోగీలు పట్టాలపై నిలిచిపోయాయి. అయితే ఈ బోగీలు విడిపోవడాన్ని గుర్తించిన లోకో పైలట్ రైలును తర్వాతి స్టేషన్‌లో నిలిపివేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇది జరిగింది. తిరువళ్లూరు స్టేషన్ దాటుతుండగా ప్రయాణికులకు పెద్ద శబ్దం వినిపించింది. బోగీల మధ్య అనుసంధానంగా ఉండే కప్లింగ్ పిన్ ఊడిపోయింది. దీంతో ఎస్-7, ఎస్-8 కోచ్‌లు రైలు నుంచి విడిపోయాయి. అది గమనించిన లోకోపైలట్ రైలును తర్వాతీ స్టేషన్‌లో ఆపేశాడు. అయితే ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మళ్లీ రెండు బోగీలను రైలుకు కలిపారు. కప్లింగ్ పిన్ ఊడిపోవడంతోనే బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు తెలిపారు.
ఇదిలావుంటే శుక్రవారం శాలిమార్ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఇలాంటి ప్రమాదం తప్పింది. రైల్లో అగ్నిప్రమాదం జరిగింది. రైలు ఇంజన్ వెనుక ఉండే లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడాన్ని గమనించిన లోకో పైలట్ గమనించి వెంటనే ట్రైన్ ఆపేశాడు. ఆ తర్వాత ఈ సమాచారాన్ని పై అధికారులకు తెలియజేశాడు. దాంతో సెంట్రల్ రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. వెంటనే ఇంజన్‌ను, రైల్లోని ప్రయాణికులున్న బోగీలను ఆ మంటలు చెలరేగుతున్న కంపార్ట్‌మెంట్ నుంచి వేరు చేయించారు. తర్వాత ప్రయాణికుల బోగీలతో రైలును అక్కడి నుంచి పంపించేశారు. దాంతో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.