‘‘అమరావతిని ఏపీ రాజధానిగా చంద్రబాబు ప్రతిపాదించినప్పుడు జగన్ ఒప్పుకొన్నారు. అందుకే రైతులు భూములిచ్చారు. అదే ఇవాళ చర్చనీయాంశం. అప్పుడే జగన్ వ్యతిరేకించి, ఇది తప్పు అని చెప్పి ఉంటే రైతులు భూములు ఎందుకిస్తారు? ఇవాళ వారికి బాధ ఉండేదా?’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మూడు రాజధానులు అనేది కొత్త ప్రతిపాదన. అది ఏమవుతుందో సుప్రీం కోర్టు తేలుస్తుంది. ఫస్ట్ అక్కడ రాజధానిని వ్యతిరేకించినవాడిని నేనే. భ్రమరావతి అనే పుస్తకం కూడా రాశా. పోలవరం అర్రీబుర్రీగా తేలే విషయం కాదు. దానిని ఇటీవల తేల్చి చెప్పిన జలవనరుల మంత్రిని నేను అభినందించా. రాష్ట్ర పరిస్థితిపై విభజన వ్యథ అనే పుస్తకం రాస్తున్నా. చరిత్ర రికార్డు అవ్వాలని రాస్తున్నా. పవన్ కల్యాణ్‌ను నేను విమర్శించను. ఆయన ఇంతవరకూ అధికారంలో లేరు. ఆయనపై రెక్కీ నిర్వహించారనేది వివాదాస్పద అంశం. దానిపై నేను జడ్జిమెంట్ ఇవ్వలేను. ఇవాళ న్యాయం అధఃపాతాళంలో ఉంది. దానికి కోర్టులు కారణం కాదు. జడ్జిలు ఎక్కువ ఉంటే తీర్పులు త్వరగా వస్తాయి’’ అని ఉండవల్లి అన్నారు.