అమరావతిని నాశనం చేయడం రాష్ట్రానికి అరిష్టమని రాజధాని రైతులు తెలిపారు. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు చేస్తోన్న ఆందోళనలు మంగళవారం నాటికి 1057వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ఆదాయ వనరు అమరావతని కాదని సీఎం జగన్‌రెడ్డి మూడు ముక్కల ఆటతో ఏపీని నాశనం చేయడం దేనికని ప్రశ్నించారు. రాజకీయాల కోసం అమరావతిని బలి చేస్తున్నారన్నారు. అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఉన్నా లెక్క లేకుండా పాలకులు వ్యవహరించడం వారి అడ్డగోలు తనానికి నిదర్శనమన్నారు. అరాచక పాలన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. సొంత ప్రయోజనాల కోసం పెట్టుకున్న ఎజెండా మూడు రాజధానులు అని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను గాలికి వదిలేసి, భూములు త్యాగం చేసిన రైతులను అవమానాలకు గురి చేయడం పాలకుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రమని ప్రతి వారు చర్చించకుంటుంటే సిగ్గు లేకుండా పాలకులు పదవుల్లో కొనసాగడం విడ్డూరంగా ఉందన్నారు. హైకోర్టు తీర్పును గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని 29 గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు.