కాకినాడ జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజుల్లో పోలీ సుశాఖ, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరోల ఆధ్వర్యంలో నాటుసారా తయారీ కేంద్రాలు, అక్రమ మద్యం రవాణా, అమ్మకాలపై జరిపిన దాడు ల్లో 64 కేసులు నమోదు చేసి 43 మందిని అరెస్టు చేసినట్టు ఎస్పీ ఎం.రవీంద్రబాబు మంగళవారం తెలిపారు. కాకినాడ సౌత్ అండ్ నార్త్, పిఠాపురం, తాళ్ళరేవు, ప్రత్తిపాడు, పెద్దాపురం, తుని ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 266 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, 3,650 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. యానాం ప్రాంతం నుంచి అక్రమ రవాణా సాగిస్తున్న నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ 540 బాటిళ్లను స్వాధీనం చేసుకుని రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేశామన్నారు. నాటుసారా తయారీ, విక్రయాలు, అక్రమ మద్యం, మాదకద్రవ్యాల రవాణా నేర మని, ఇటువంటివి ఉపేక్షించబోమన్నారు. ఇప్పటివరకు జిల్లాలో అక్రమ సారా వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రకారం 13 మందిని కేంద్ర కారాగారానికి పంపామన్నారు. ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపా లకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా ఎస్‌ఈబీ కంట్రోల్ రూమ్ నెంబరు 9490618510 లేదా ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబరు 14500కు సమాచారం అందించాలని ఎస్పీ రవీంద్రబాబు కోరారు.