కరోనా కష్టాలు అన్ని దిగ్గజ కంపెనీలను అతలాకుతలం చేశాయి. ఇదిలావుంటే తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో 13 శాతం మంది ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ బుధవారం సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఫేస్ బుక్ లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 13 శాతం... అంటే దాదాపుగా 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఫేస్ బుక్ ప్రారంభమైన నాటి నుంచి ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలి సారి. ఇదే అంశాన్ని ప్రస్తావించిన జుకెర్ బర్గ్... ఇది తనకు అత్యంత కష్టమైన నిర్ణయమని, అయినా కూడా సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఉద్యోగుల తొలగింపునకు గల కారణాలను కూడా జుకెర్ బర్గ్ తన ప్రకటనలో వివరించారు. ప్రకటన ఆదాయం తగ్గడం వల్ల సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన తెలిపారు. ఫలితంగా కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపుతో పాటుగా వచ్చే ఏడాది తొలి త్రైమాసికం వరకు నియామక ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత తనదేనన్న జుకెర్ బర్గ్... తనను క్షమించాలంటూ తొలగింపునకు గురైన ఉద్యోగులను కోరారు.
తొలగింపునకు గురైన ఉద్యోగులకు కంపెనీ నుంచి ఈ మెయిల్ వస్తుందని, ఆ వెంటనే వారి కంప్యూటర్లకు యాక్సెస్ ను నిలిపివేస్తామని జుకెర్ బర్గ్ తెలిపారు. తొలగింపునకు గురైన ఉద్యోగులకు 16 వారాల వేతనం ఇస్తామన్న జుకెర్ బర్గ్... వారు సంస్థలో పనిచేసిన కాలానికి ఏడాదికి 2 వారాల చొప్పున అదనపు వేతనం ఇస్తామన్నారు. అదే విధంగా తొలగింపునకు గురైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు 6 నెలల వరకు ఆరోగ్య బీమా కొనసాగుతుందని జుకెర్ బర్గ్ ప్రకటించారు.