టీ20 వరల్డ్ కప్‌లో భారత్ గురువారం సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. గురువారం మధ్యాహ్నం 1.30కి అడిలైడ్‌లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి పాక్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో నేడు ఇంగ్లాండ్‌తో జరిగే సెమీ ఫైనల్‌లో టీమిండియా ఎలాగైనా గెలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్‌లో పాకిస్తాన్‌తో తలపడాలని, 2007 ఫలితాన్ని పునరావృతం చేసి ప్రపంచ కప్ సాధించాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే సెమీ ఫైనల్‌లో భారత్ ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్లు, మ్యాచ్ విన్నర్లతో కూడిన జట్టు. దీంతో కీలక సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా భారత ఆటగాళ్లు రాణించాల్సిన తరుణం ఆసన్నమైంది.
భారత్ విషయానికొస్తే విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌ల అద్భుత బ్యాటింగ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్‌ల అద్భుతమైన బౌలింగ్ అటాక్‌తో భారత్ నాకౌట్‌లోకి అడుగుపెట్టింది. ఇంగ్లండ్ జట్టకు చివరి వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. ఆ జట్టు బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా ప్రత్యర్థులకు సవాల్ విసరగలరు. అయితే ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగల ఆటగాళ్లు ఇరు జట్లలోలోనూ ఉండడంతో హోరాహోరీ పోరు సాగనుంది.
అడిలైడ్ ఓవల్ స్టేడియం పరిమాణంలో చిన్నది. ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. పిచ్ మందకొడిగా ఉండటంతో స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషించనున్నారు. టీమిండియా టాప్ ఆర్డర్ రాణిస్తే జట్టు విజయానికి ఢోకా ఉండదు. టీ20 వరల్డ్ కప్-2022లో పవర్-ప్లేలలో భారత్ ఓవర్‌కు 5.96 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ 6.79 పరుగులతో భారత్ కంటే మెరుగ్గా ఉంది. కొత్త బంతితో బౌలర్లు చెలరేగే అవకాశం ఉన్నందున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లితో కూడిన టాప్ ఆర్డర్ పిచ్‌పై నిలదొక్కుకునేందుకు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు టోర్నమెంట్‌లో రోహిత్-కేఎల్ రాహుల్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కేవలం 27 పరుగులు. బ్యాటింగ్ భారాన్ని కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ మోస్తున్నారు. ఇక సూర్యకుమార్ యాదవ్‌పై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. టోర్నీలో చెలరేగుతున్న సూర్య నేటి మ్యాచ్‌లోనూ అత్యధిక పరుగులు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఫైనల్‌లో పాక్‌ను ఢీకొట్టనుంది. ఇరు దేశాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాలని, భారత్ విజయం సాధించి కప్పును ముద్దాడాలని అభిమానులంతా ఆశిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.