ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం సాయంత్రం 7. 25 గంటలకు మోదీ విశాఖకు చేరుకోనున్నారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇదే వేదికపై నుంచి రూ. 15, 233 కోట్లు విలువైన 9 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా విశాఖ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మద్దిలపాలెం జంక్షన్ నుంచి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. అలాగే సభ జరిగే ఏయూ మైదానానికి 5 కిలోమీటర్ల పరిధిని 'నో డ్రోన్ జోన్'గా నగర పోలీస్ కమిషనర్ సి. హెచ్. శ్రీకాంత్ ప్రకటించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎవరైనా డ్రోన్లు ఎగరవేస్తే వారిపై ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.