పాతిక్రేయుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ అన్నారు.. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఇటీవల ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమితులవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొమ్మినేని నేడు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో ఏపీ సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి సమక్షంలో బాధ్యతలు అందుకున్నారు.
ఈ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, తనపై అపార నమ్మకం ఉంచి ప్రెస్ అకాడమీ బాధ్యతలు అప్పగించారంటూ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. పాత్రికేయుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అటు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందిస్తూ, పాత్రికేయ రంగంలో కొమ్మినేని అందించిన సేవలను సీఎం జగన్ గుర్తించి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. కొమ్మినేని ఈ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నానని, బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
ఇదిలావుంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావు సీఎం జగన్ ను కలిశారు. సతీసమేతంగా క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కొమ్మినేని... అక్కడ సీఎం జగన్ ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తనను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.