దళితుల సమస్యల పరిష్కారంలో విఫలమైన అధికార వైసీపీకి చెందిన దళిత మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి 36 పథకాలు రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో 500 కేసుల్లో ఎస్సీలే బాధితులుగా ఉన్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికార వైసీపీకి చెందిన డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు మెపదడంలేదన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ తసీఎం నారాయణస్వామి, హోం మంత్రి వనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత నిరుద్యోగులు 10 లక్షల మందికి ఉపాఽధి లేకుండా పోయిందన్నారు. దళితుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.32 వేల కోట్లు ఇస్తే ఆ నిధులు ఎక్కడికి మళ్లించారని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరిమి రాధ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుమన్ పాల్గొన్నారు.