దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రధాని మోదీ అన్నారు. నేడు విశాఖ సభలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైల్వేస్టేషన్లు, పోర్టుల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మిషన్ గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల కల్పన చేస్తామన్నారు. మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ప్రతి నగరానికి అవసరమన్నారు. విశాఖపట్నం కూడా ఈ దిశగా ముందడుగు వేస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయన్నారు. ఇవాళ ప్రతి దేశం ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం నేడు భారత్ వైపు చూస్తోందన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. వెనుకబడిన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మోదీ వెల్లడించారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు, పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. సన్‌రైజ్ సెక్టార్ ఆలోచన కారణంగా యువతకు కొత్త అవకాశాలు వస్తున్నాయన్నారు. సముద్ర వ్యాపారాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.