వీకెండ్ లో ఇక్కడికొచ్చి జనాన్ని రెచ్చగొట్టి మళ్లీ హైదరాబాద్ పారిపోవడం తప్ప నువ్వు చేసేది ఏముంది? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఉద్దేశించి మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఇదిలావుంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించి జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించడం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేష్ స్పందించారు.
కొంతమంది పిల్ల సైకోలను వెంటేసుకుని వచ్చి గుంకలాంలో సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వీకెండ్ లో ఇక్కడికొచ్చి జనాన్ని రెచ్చగొట్టి మళ్లీ హైదరాబాద్ పారిపోవడం తప్ప నువ్వు చేసేది ఏముంది? అంటూ విమర్శించారు. ఒక్కసారి గడపడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చి చూస్తే ప్రజలు మమల్ని తిడుతున్నారో, అభినందిస్తున్నారో తెలుస్తుంది అని జోగి రమేష్ హితవు పలికారు.
పవన్ కల్యాణ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని, గుంకలాంలో 12 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే, అసలక్కడేమీ పనులు జరగనట్టు పవన్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కళ్లుంటే సరిగా చూస్తే గుంకలాంలో ఏం జరుగుతోందో కనిపిస్తుందని జోగి రమేష్ అన్నారు. గుంకలాంలో పనులు ఆగమేఘాలపై జరుగుతుండడం చూసి పవన్ కు కడుపుమంటగా ఉందని విమర్శించారు. పవన్, ఆయన దత్త తండ్రి కలిసొచ్చినా వైసీపీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. అసలు, పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలవగలడా అని ఎద్దేవా చేశారు.
"వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తాడో, నువ్వెక్కడ్నించి పోటీ చేయాలో ముందు అది చూసుకో. ఎక్కడ్నించి పోటీ చేయాలో చంద్రబాబుకే అర్ధం కావడంలేదు... సొంతపుత్రుడికి, దత్తపుత్రుడికి ఎక్కడ సీట్లు ఇస్తాడు? 2024లో చంద్రబాబు, లోకేశ్, పవన్ ఎవరూ గెలవరు... అసెంబ్లీలో అడుగుపెట్టరు" అని స్పష్టం చేశారు.