మూడు రాజధానుల కేసుపై ఈ నెల 28న విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లతో సంబంధం లేకుండా మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ రెండు అంశాల పిటిషన్లను వేరు చేసింది. అమరావతియే ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం... తీర్పును అమలు చేయించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి... మూడు రాజధానులను సమర్థిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజీ సీఎం ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి, వైసీపీ ఎంపీ రఘురామరాజు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు... మొత్తం కలిపి 36 పిటిషన్లు సోమవారం నాడు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఈ కేసు విచారణ తేదీలపై వచ్చిన భిన్నాభిప్రాయాలను విన్న ధర్మాసనం 28న విచారణ చేపడుతామని తేల్చి చెప్పింది. అదే రోజు రాష్ట్ర విభజన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లు కూడా విచారణకు వస్తాయని, వాటిని వేరేగా విచారిస్తామని తెలిపింది.