ప్రపంచ వ్యాప్తంగా జనాబా పెరుగుదల విపరీతంగా జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలకు మున్ముందు ఈ వాళ్లు తప్పవని నిపుణఉలు చెబుతున్నారు. ఇదిలావుంటే ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. శాస్త్రీయ పురోగతి, పోషకాహారం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదే సమయంలో మానవ ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో ప్రస్తావించింది.
ఆకలి కేకలు..
ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది నేటికీ ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ఆహార, ఇంధన సంక్షోభాలకు కారణమైంది. 1.4 కోట్ల చిన్నారులు తీవ్ర పోషకాహార సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, తదితర సమస్యల వల్ల 45 శాతం చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2019-2022 మధ్య పోషకాహార లోపం బాధితుల సంఖ్య 15 కోట్ల మేర పెరిగింది. 2021 నాటికి 69.8 కోట్లు (జనాభాలో 9 శాతం) తీవ్ర పేదరికంలో ఉన్నారు. దారుణమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోని ప్రజలు అందరికీ సరిపడా ఆహారం ఉంది. కానీ, అది వృథా అవుతోంది. ఉత్పత్తి అవుతున్న ఆహార గింజల్లో ఒక వంతు ఖర్చు కావడం లేదు. పంట సాగు నుంచి రిటైల్ చేసే వరకు 14 శాతం, ఇళ్లు, రెస్టారెంట్లు, స్టోర్ల వద్ద 17 శాతం వృథా అవుతోంది.
వాతావరణ మార్పుల ఉపద్రవాలు
వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వచ్చే ఉత్పాతాలు కూడా ఒక సవాలే. కాలుష్య ఉద్గారాలు పెరగడం, ఉష్ణోగ్రతల పెరుగుదల అన్నవి వరదలు, తుపానులు, కరవులకు కారణమవుతున్నాయి. వీటి కారణంగా గడిచిన 50 ఏళ్లలో సగటున రోజూ 115 మంది చనిపోగా, 202 మిలియన్ డాలర్ల నిధులు వృథా అయ్యాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల వాతావరణ సంక్షోభాలను పెంచుతున్నాయి.
పట్టణీకరణ
పట్టణీకరణతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ప్రపంచ జనాభాలో 56 శాతం (440 కోట్లు) పట్టణాల్లోనే జీవిస్తున్నారు. 2050 నాటికి పట్టణ జనాభా ప్రస్తుతమున్న దాని నుంచి రెండింతలకు పైగా పెరుగుతుంది. ప్రతి 10 మందిలో 7 మంది పట్టణాల్లోనే నివసిస్తారు. మరి పట్టణ జనాభా పెరుగుతుంటే ఇళ్లకు డిమాండ్ కూడా పెరిగిపోతుంది. రవాణా వసతులు, సౌకర్యాలు, ఉపాధి.. ఇవన్నీ కూడా సవాళ్లు కానున్నాయి. దీనివల్ల భూమి, నీరు, సహజ వనరులపై ఒత్తిళ్లు పెరుగుతాయి. పర్యావరణ అనుకూల, స్మార్ట్ పట్టణాలను రూపొందించడమే దీనికి పరిష్కారమని నిపుణుల సూచన.
వృద్ధ జనాభా
2050 నాటికి ప్రపంచంలో వృద్ధ జనాభా అధికం కానుంది. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య, అదే సమయానికి ఐదేళ్లు, అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల సంఖ్యతో పోలిస్తే రెండింతలు కానుంది. సగటు ఆయుర్దాయం 77.2 ఏళ్లుగా ఉంటుంది. దీనివల్ల సంక్షేమ వ్యయాల భారం పెరిగిపోతుంది. వారికోసం మరిన్ని ఆరోగ్య సదుపాయాలు కల్పించాల్సి వస్తుంది.