చైనా అంటే అందరికీ తెలిసిందే. ప్రతిసారి భారత్ పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తూనే ఉంది. ఇదిలావుంటే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చిరునవ్వులతో పలకరించుకున్నారు. కరచాలనం చేసి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత మంగళవారం ఇరు దేశాల నేతల మధ్య సామరస్యపూర్వక భేటీ జరిగింది. వీరిద్దరి భేటీకి ఇండోనేషియాలోని బాలి వేదికయ్యింది. గల్వాన్ ఘర్షణల తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం రెండు దేశాల మధ్య సంబంధాలపైనా పడింది. అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య మర్యాదపూర్వక పలకరింపు కూడా కరువయ్యింది.
ఇండోనేషియాలోని బాలిలో జీ20 దేశాల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీతో పాటు చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ హాజరయ్యారు. సదస్సుకు హాజరైన వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానుల గౌరవార్థం ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో మంగళవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో జిన్ పింగ్, మోదీ ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో ఇద్దరూ చిరునవ్వుతో పలకరించుకుంటూ, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ ఏడాది సెప్టెంబర్ లో ఉజ్బెకిస్తాన్ లో షాంఘై సహకార సదస్సు(ఎస్ సీ ఓ) జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు కూడా మోదీ, జిన్ పింగ్ ఇద్దరూ హాజరయ్యారు. ఒకే వేదికను పంచుకున్నప్పటికీ నేతలిద్దరూ కనీసం పలకరించుకోలేదు. ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉండిపోయారు.