రష్యా మళ్లీ క్షిపణిని ప్రయోగించింది. పోలండ్ లోని ఓ చిన్న గ్రామంపై మంగళవారం రాత్రి క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు గ్రామస్తులు చనిపోయారు. ఉక్రెయిన్ సరిహద్దులకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. ఈ దాడితో నాటో దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సునూ ఈ దాడి కలవరపెట్టింది. సదస్సుకు హాజరైన జీ20 దేశాలు అత్యవసరంగా భేటీ అయ్యాయి. ఇందులో నాటో దేశాలు అమెరికా, జర్మనీ, కెనడా, నెదర్లాండ్స్, జపాన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ కూడా ఉన్నాయి. కాగా, మంగళవారం ఉక్రెయిన్ పై వరుస క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడింది.
క్షిపణి దాడిపై పోలండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. దాడి వివరాలతో ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులకు కూతవేటు దూరంలోని ప్రజ్వోడో గ్రామంలో క్షిపణి పడిందని అందులో పేర్కొంది. గ్రామానికి చెందిన ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఆ క్షిపణి రష్యాలో తయారైందేనని ప్రాథమిక ఆధారాలు దొరికాయని వివరించింది. అయితే, ఆ క్షిపణిని తమపైకి ఏ దేశం ప్రయోగించిందనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదని పోలండ్ ప్రెసిడెంట్ ఆండ్రెజెజ్ డుడా తెలిపారు.
ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. లేక పొరపాటున తమ దేశంపై పడిందా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా,సదరు క్షిపణి రష్యాలో తయారైందని గుర్తించిన వెంటనే తమ దేశంలోని రష్యా రాయబారికి నోటీసులు పంపినట్లు అంతకుముందు పోలండ్ విదేశాంగ శాఖ తెలిపింది.