‘ఈ ముఖ్యమంత్రికి పాలన చేతకాదు.. నియంతగా మారాడు. దావూద్ ఇబ్రహీంను మించిపోయాడు..’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం పత్తికొండలో భారీ రోడ్‌షో, బాదుడే బాదుడు జనం సభలో ఆయన పాల్గొన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం దగ్గర విద్యార్థుల ముఖాముఖిలో మాట్లాడారు. అంతకుముందు దేవనకొండ, కోడుమూరులో ప్రసంగించారు. అడుగడుగునా జేజేలు పలుకుతున్న ప్రజలను, టీడీపీ కార్యకర్తలను చూసి చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడారు. అదే క్రమంలో జగన్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారని.. పేదలను ఆర్థిక కష్టాల్లో నెట్టేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకున్నామని వాపోయారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పత్రికల్లో వార్తలు రాసినా దాడులు చేస్తున్నారని ఆక్షేపించారు. ‘కేసులు పెట్టి వేధిస్తున్నారు. సీఐడీని పంపిస్తున్నారు. ఆ సంస్థల వ్యాపారాలపై దాడులు చేయిస్తున్నారు. చివరకు జడ్జిలను కూడా వదల్లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అవమానపరుస్తున్నారు. ఈ దావూద్ జగన్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది’ అని తెలిపారు.