బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు నేటికీ 1066వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ పాలకులకు కూలదోయడం తప్ప నిర్మించడం చేతకాదన్నారు. ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ పాలన మొదలైందన్నారు. అమరావతి రాజధానిని నాశనం చేయదలుచుకున్న వారికి పేదల ఇళ్లు కూల్చటం ఒక లెక్కే కాదన్నారు. అమరావతిని స్వాగతిస్తున్నామని ఎన్నికల ముందు చెప్పి అధికారం చేపట్టాక మూడు రాజధానులు అనటం సిగ్గుగా లేదా.. అని ప్రశ్నించారు. అద్భుతమైన ఆంధ్రుల రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.