ఏపీలో క్రికెట్ ఎన్నికల సందడి మొదలు కానున్నది. దేశవాళీ క్రికెట్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) ఎన్నికలకు సర్వంసిద్ధమవుతోంది. ఆంధ్రా క్రికెట్ సంఘంలోని కీలక పదవులకు డిసెంబరు 3న ఎన్నికలు నిర్వహించనున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, అపెక్స్ కౌన్సిల్, ఓ కౌన్సిలర్ పదవులకు పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ఫలితాలు వెల్లడిస్తారు. ఆంధ్రా క్రికెట్ సంఘం నియమావళి మేరకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.
గత కొంతకాలంగా ఆంధ్రా క్రికెట్ సంఘం మెరుగైన పనితీరుతో బీసీసీఐని ఆకట్టుకుంటోంది. ఆంధ్రా జట్టు నుంచి వచ్చిన ఎమ్మెస్కే ప్రసాద్ జాతీయ జట్టులో చోటు సంపాదించడమే కాదు, రిటైర్ అయిన తర్వాత టీమిండియా చీఫ్ సెలెక్టర్ గానూ పనిచేశాడు. యువ క్రికెటర్లు హనుమ విహారి, శ్రీకర్ భరత్ వంటి ప్రతిభావంతులు ఇప్పుడు టీమిండియా ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రికీ భుయ్ తదితరులు దేశవాళీల్లో విశేషంగా రాణిస్తున్నారు.