ఓ ఆటగాడి విషయంలో ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముగిసిన టీ-20 ప్రపంచకప్ చూసే ఉంటారు. ఫేవరెట్ జట్లు ముందే ఇంటిముఖం పట్టగా.. చివరికి ఇంగ్లాండ్ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించి టైటిల్‌కు అర్హత కలిగిన జట్టుగా పేరుసంపాదించుకుంది. తుదిపోరులో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ మరోసారి తన అద్భుత ఆటతీరుతో అజేయంగా నిలిచి తన జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మరో ఓవర్ మిగిలుండగానే బ్రిటిష్ జట్టుకు వరల్డ్ కప్ అందించడంలో కీలకంగా ఉన్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ను కూడా ఇంగ్లాండే గెల్చుకుంది. అప్పుడు కూడా ఫైనల్లో స్టోక్స్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అసమాన ఆటతీరు కనబరిచాడు. ఇక ఇప్పుడు మరోసారి మంచి ఆట ఆడిన నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడి అభిమానుల జాబితాలో ఇప్పుడు భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా నిలిచారు. అతడి ఆటను పొగడకుండా ఉండలేకపోయారు.
చాలా మంది పొగిడినట్లుగా కాకుండా తనదైన శైలిలో చమత్కారం చేశారు ఆనంద్ మహీంద్రా. బెన్ స్టోక్స్ నరాలు, సిరల నుంచి ద్రవాల్ని బయటకు తీసి.. దాంతో వ్యాక్సిన్‌ను తయారుచేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ను కోరుతూ సరదాగా అన్నారు. అతడికి ఓటమంటేనే తెలియదంటూ ప్రశంసలు కురిపించారు. ''హల్లో. ఇది సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియానేనా? దయచేసి బెన్ స్టోక్స్ నరాల నుంచి కొంచెం ద్రవం వెలికితీసి.. దాంతో వ్యాక్సిన్ తయారుచేయగలరా? ఈ జెంటిల్‌మెన్‌కు అసలు ఓటమంటేనే తెలియదు. అందుకే విక్టరీ వ్యాక్సిన్ తయారుచేయాలి. (మొదటి డోసు తీసుకునేందుకు ఎక్కడ నమోదు చేసుకోవాలి?)'' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడం విశేషం. స్టోక్స్ రెండు వరల్డ్ కప్పు ఫైనల్స్‌లో కీలకంగా ఉండి మ్యాచ్ గెలిపించాడని ఎవరో చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఇలా కామెంట్స్ చేశారు. ఇక దీనిపై నెటిజన్లు ఆనంద్ మహీంద్రా చమత్కారానికి ఫన్నీ కామెంట్లు జోడిస్తున్నారు.
ఆదివారం జరిగిన ఫైనల్లో పాక్ తొలుత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. మసూద్ (38), బాబర్ అజామ్ (32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కర్రన్ రన్స్ కట్టడి చేసి 3 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లాండ్ కాస్త తడబడ్డా.. స్టోక్స్ నిలబడటంతో 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టోక్స్ (52 నాటౌట్) టాప్ స్కోరర్. దీంతో ఇంగ్లాండ్ రెండోసారి టీ-20 వరల్డ్ కప్ గెల్చింది. 2019లో వన్డే వరల్డ్ కప్ కూడా దక్కించుకుంది.