భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా కొట్టుకుపోయింది. కనీసం టాస్ కూడా వేయలేదు. ఉదయం నుండి వెల్లింగ్‌టన్‌లో కురుస్తున్న వర్షం మైదానాన్ని చిత్తడి మైదానంగా మార్చింది. దీంతో టాస్ ఆలస్యమైంది. ఆ తర్వాత వరుసగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు తుది నిర్ణయం తీసుకున్నారు. కనీసం 5 ఓవర్ల పాటైనా మ్యాచ్ నిర్వహించాలని భావించినా.. వర్షం అవకాశం ఇవ్వలేదు. గత వారమే భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ కోసం ప్రత్యర్థి జట్లతో సెమీ ఫైనల్స్ ఆడాయి. ఓటమితో రెండు గ్రూప్ టాపర్స్ జట్ల ఆశలకు అక్కడే తెర పడింది. ఇప్పుడు ఓ రకంగా ఈ మూడు టీ20ల సిరీస్‌ను 'కాంస్య పత పోరుగా అభిమానులు భావించారు. కానీ వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది.