ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టిడ్కో గృహాలలో మౌలిక వసతుల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ఇళ్లను ప్రజలకు అందజేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి అన్నారు. కార్పోరేషన్ పరిధిలోని పెనుమాక, నవులూరు, నిడమర్రు టిడ్కో గృహ సముదాయాలను శుక్రవారం ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావు, టిడ్కో అధికారులు, ఎలక్ట్రికల్ మరియు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మౌలిక వసతుల పనులను మరింత వేగవంతం చేయాలని అన్నారు. డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పనులను పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలని సూచించారు. లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో త్రాగునీటిని అందించాలని ఇందుకోసం ఒక్కొక్క సముదాయం వద్ద రెండు 1. 5 ఎంఎల్డీ గల ప్రెజర్ శాండ్ ఫిల్టర్ లను ఏర్పాటు చేయాలన్నారు. అలానే టిడ్కో బ్లాకులకు పెయింటింగ్స్ ను పూర్తిచేయాలని అన్నారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ను డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సైట్ లెవ్లింగ్ మరియు అప్రోచ్ రోడ్లను అంతర్గత రోడ్లను నిర్ణిత సమయంలో పూర్తి చేయాలని చెప్పారు. కాంపౌండ్ వాల్ మరియు స్కూలు అంగన్వాడి వంటి సౌకర్యాలు నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.