టీడీపీ నేత పోల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం చేసిన నిందితులకోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితులను గుర్తించినప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో జిల్లా అధికారులు ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన అనంతరం తుని నుంచి నిందితులు పరారయ్యారు. ఈ ఘటన ఉదయం 6.45 ప్రాంతంలో జరుగగా, వెంటనే పోలీసులు అప్రమత్తమై అనకాపల్లి జిల్లా పోలీసులను, స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి ఉంటే నిందితులు వెనువెంటనే పట్టుబడి ఉండేవారని, స్థానిక పోలీసుల అలసత్వం వల్ల వారు తప్పించుకోగలిగారన్న వాదన టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. నిందితులు చిక్కితేనేగానీ దీని వెనుక శక్తుల ప్రమేయం బహిర్గతమయ్యే అవకాశం లేకపోవడంతో ప్రజలంతా ఈ విషయ మై ఉత్కంఠతతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసు విషయమై పోలీసులు మరింత దూకుడు పెంచాల్సి ఉందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.