చంద్రబాబును అడ్డుకోవడం దుర్మార్గమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరిక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ ఉద్యమం పేరుతో జగన వైసీపీ కూలీలు చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించడం చిల్లర రాజకీయాలకు నిదర్శనమన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటనలో ప్రజల జన నీరాజనాలు పడుతుండడం, విజయవంతం కావడం తో వైసీపీ నేతలు జీర్ణించుకోలేక అడ్డుకోవడం దుర్మార్గ చర్య అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తమ అసమర్ధ పాలనను కప్పి పుచ్చుకునేందుకే డ్రామాలకు తెర లేపారన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ మూడు సంవత్సరాల్లో రాయలసీమలో అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. టీడీపీ హయంలోనే రాయలసీమ అభివృద్ధి చెందిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా మీడియా కో ఆర్డినేటర్ జనార్ధన, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీనివాసులు, బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డయ్యయాదవ్లు పాల్గొన్నారు.