గిరిజన సంక్షేమానికి వివిధ పథకాల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కోట్లాది రూపాయలనూ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించేసింది. ఇచ్చిన నిధులకు కేంద్ర ప్రభుత్వం లెక్కలు అడుగుతుంటే మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో నిధుల వినియోగానికి సంబంధించి యుటిలిటీ సర్టిఫికెట్లు(యూసీ)లు సమర్పించకపోతే నిధులు ఇవ్వబోమని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్రానికి హెచ్చరికలు పంపింది. ఆర్టికల్ 275(1) నిధులకు సంబంధించిన సమావేశం ఈ నెల 21న జరగనుండటంతో నిధుల వినియోగానికి సంబంధించి ఆ సమావేశంలో కేంద్ర అధికారులకు ఏం చెప్పాలో అని రాష్ట్ర అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఈ పథకాలకు సంబంధించి సుమారు రూ.766 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది. అయితే అందులో రూ.244 కోట్లకు లెక్కలు చూపించలేదు. దీంతో ఆ నిధులకు సంబంధించిన యూసీలు పంపాలని కేంద్ర అధికారులు పదే పదే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలిస్తున్నారు.