ముఖ్యమంత్రి బాదుడు తట్టుకోలేక ప్రజలంతా ఏంఖర్మ-ఈ రాష్ట్రానికి అంటూ మనోవేదనకు గురవుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ని అరాచకప్రదేశ్ గా మార్చిన జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని ఆర్బీఐ నివేదికతో తేటతెల్లమైందని, నర్సాపురంలో జగన్ రెడ్డి అసహనానికి కారణం ఇదేనా? అంటూ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిలోని అసహనం, కోపం, ఈర్ష్యాద్వేషాలు పతాకస్థాయికి చేరాయని, చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా అక్కడ కనిపిస్తోన్న జన సునామీలే అందుకు కారణమని అన్నారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో పట్టాభి మాట్లాడుతూ, “చరిత్రలో ఎన్నడూ చూడనంత జనం కర్నూలులో చంద్రబాబు పర్యటనకు వచ్చారు. ముఖ్యమంత్రి బాదుడు తట్టుకోలేక ప్రజలంతా ఏంఖర్మ-ఈ రాష్ట్రానికి అంటూ మనోవేదనతో, గతంలో చంద్రబాబునాయుడి గారి సుపరిపాలన గుర్తుచేసుకొని తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయన్న ప్రగాఢ విశ్వాసంతోనే ఘన నీరాజనాలు పలుకుతున్నారని అర్థమవుతోంది.
నేడు నరసాపురంలో జరిగిన ముఖ్యమంత్రి సభకు ప్రజల్ని ఇళ్లనుంచి బలవంతంగా లాక్కొచ్చి, బస్సుల్లో కుక్కి తరలించినా కూడా ప్రజలు మధ్యలోనే బారికేడ్లు దూకి పారిపోయారు. ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలు వినలేక జనం పరుగులు పెడుతుంటే, పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
తెలుగుదేశంపార్టీ చేపట్టబోతున్న ‘ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి’ కార్యక్రమంపై జగన్ రెడ్డి తన అక్కసంతా వెళ్లగక్కాడు. ఏ వర్గంవారిని పలకరించినా అందరినోటా ఒకటేమాట ‘ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి’. చంద్రబాబుకి బైబై చెప్పడానికి జనం సిద్ధంగాలేరు జగన్ రెడ్డీ! బాబాయ్ కి బైబై చెప్పినంత తేలికకాదు.. మా పెద్దాయనకి బైబైచెప్పడం అంటే. జగన్ రెడ్డీ...నిన్ను భూస్థాపితం చేసేవరకు చంద్రబాబునాయుడు గారు విశ్రమించరని గుర్తుపెట్టుకో. 98 శాతం హామీలు నెరవేరిస్తే, ప్రజలంతా నీ పక్కనుంటే నరసాపురం పట్టణంలోని ప్రతిసందులో బారికేడ్లు ఎందుకుపెట్టారో చెప్పు?
జగన్ రెడ్డికి బారికేడ్లపై ఉన్నమోజు చూసే ప్రజలంతా ఆయన్ని ముద్దుగా 'బారికేడ్ రెడ్డి' అని పిలుస్తున్నారు. ముఖ్యమంత్రికి ప్రజల్లోకి రావడానికి ఎందుకంత భయం? రాష్ట్రాన్ని అరాచకప్రదేశ్ గా మార్చారు కాబట్టే భయపడుతున్నారు. జగన్ రెడ్డి అరాచకం, జేట్యాక్స్ దందా భరించలేకనే, చంద్రబాబు రాయలసీమకు తీసుకొచ్చిన జాకీ పరిశ్రమ రాష్ట్రం వదిలిపారిపోయింది. అదేనా జగన్ రెడ్డీ... తమరి అద్భుతమైన పరిపాలన?
చంద్రబాబునాయుడి గారి హయాంలో ఏపీ సన్ రైజ్ స్టేట్ గా ఉంటే, ఇప్పుడు సన్ సెట్ స్టేట్ గా మారింది. రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోంది. ఇవన్నీ జగన్ రెడ్డికి తెలిసే, ప్రజలను నేరుగా ఎదుర్కోలేక ‘బారికేడ్ల రెడ్డి’గా మారిపోయాడు. పోలీసులు, బారికేడ్ల మధ్యన దొంగలాగా దాక్కొని దాక్కొని తిరుగుతున్నాడు. ఎందుకయ్యా జగన్ రెడ్డీ... నీకు అంతఖర్మ? వేలాది పోలీసులు లేకుండా జనంలోకి వెళ్లలేని ఖర్మ ఈదేశంలో నీ కుమాత్రమే పట్టింది" అంటూ తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.