బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం శ్రీకాకుళం జిల్లా పైనా కనిపిస్తోంది. దీనివల్ల శుక్రవారం పలుప్రాంతాల్లో తేలికపాటి చినుకులు పడ్డాయి. మరోపక్క వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో కర్షకుల్లో ఆందోళన మొదలైంది. కంటికిరెప్పలా ఇప్పటివరకు పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతులు ఇప్పుడు చేతి కందే సమయంలో చినుకులు అలజడి రేపుతున్నాయి. పంటను భద్రపరుచుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్ల పైనే రాశులుగా పోసి పరదాలు కప్పి ఉంచారు. పొలాల్లో కోసిన పంటలు కుప్పలుగా పెడుతున్నారు.
నరసన్నపేట, సారవకోట, జలుమూరు, పోలాకి, గార, ఆమదాలవలస మండలాల పరిధిలో కోతలు పూర్తవుతున్నాయి. చేతికి ధాన్యం అందుతున్నా వాటిని నిల్వ చేసే సామర్థ్యం రైతుల వద్ద లేదు. ఆకాశం ఉరుముతుండటంతో ఆందోళన చెందుతున్నారు. జలుమూరు మండలంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైనా మిగిలిన చోట్ల ఇంకా కాలేదు. యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.