తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక దశాబ్దాల కాలం నుండి తీవ్ర ఇక్కట్లకు లోనై, అష్ట కష్టాలు పడుతూ, వ్యయప్రయాసలకు గురవుతూ, రోడ్డు సౌకర్యం లేని కారణంగా ఒకానొక దశలో ప్రాణాలను సైతం పోగొట్టుకునే దుస్థితి ఆ గ్రామ ప్రజలది. శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు తీసుకున్న చొరవ, కృషితో నేడు ఆ గిరిజన గ్రామాల ప్రజలకు మోక్షం కలగబోతోంది. విషయానికొస్తే. శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామపంచాయతీ పరిధిలో గల గిరి శిఖర గ్రామాలైన దబ్బగుంట, దారపర్తి గ్రామాల్లో గల గిరిజనులు కొన్ని దశాబ్దాల పాటు రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడిన విషయం పాఠకులకు విదితమే. గిరిజనులు పడుతున్న అవస్థలను గమనించిన ఎస్. కోట ఎమ్మెల్యే కడుబండి పట్టు వీడని విక్రమార్కుడిలా కృషి చేసి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బొడ్డవర పంచాయతీ పరిధిలో గల దబ్బగుంట, దారపర్తి నుండి దుంగాడ గ్రామం వరకు పి ఎం జి ఎస్ వై పథకం ద్వారా 4 కోట్ల 89 లక్షల నిధులతో శుక్రవారం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎట్టకేలకు తమ గ్రామాలకు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కృషి ఫలితంగా రోడ్డు నిర్మాణం జరగబోతున్న క్రమంలో ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు తమ హర్షం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికి గిరిజన గ్రామాలకు రోడ్డు నిర్మాణం పట్ల ఎమ్మెల్యే తీసుకున్న చొరవ అభినందనీయమని స్థానిక ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.