‘‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ డబ్బు తీసుకెళ్లి వేరే సంస్థల్లోకి మళ్లించడం, వేలాది కోట్ల రూపాయలు వేరొక అకౌంట్‌కు తరలించడం ఆర్థిక నేరం. రామోజీరావు వైట్‌కాలర్ క్రిమినల్. ఆర్థిక నేరగాడు కాబట్టే ఇంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్క పైసా పెట్టుబడి లేకుండా అతిపెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు’’ అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చిట్‌ఫండ్స్ కంపెనీ నడిపేవారు వేరే వ్యాపారం చేయకూడదని చిట్‌ఫండ్ యాక్ట్‌లో ఉన్నప్పటికీ రామోజీరావు 14–15 వ్యాపారాలు చేస్తున్నాడని, ఫైనాన్స్ కంపెనీ డబ్బును ఆయా కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు తరలిస్తున్నాడన్నారు. అధికారుల సోదాలతో రామోజీరావు బండారం బట్టబయలైందన్నారు. ఇది కక్షసాధింపు చర్య అనడం ధర్మం కాదని, రామోజీరావు తప్పు చేశాడు కాబట్టే దొరికిపోయాడన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రకార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.