రైతుల నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. నూతన ఆన్‌లైన్ విధానం ద్వారా రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఒక్కపైసా కూడా నష్టపోకుండా మద్దతు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్‌టీవో వచ్చిన 21 రోజుల్లోగా నగదు జమ చేసేలా ఆదేశించామన్నారు. ఇప్పటికే 2.30 లక్షల టన్నుల ధాన్యాన్ని కొని, రూ.160 కోట్లకు పైగా చెల్లించామన్నారు. ఇందులో ధాన్యం అమ్మిన మరుసటిరోజే నగదు జమయిన రైతులు కూడా ఉన్నట్లు వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సత్వర న్యాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టాన్ని సవరించినట్లు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు.