ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు న్యూజిలాండ్‌తో రెండో వన్డే... భారత తుది జట్టు ఇదేనా?

sports |  Suryaa Desk  | Published : Sat, Nov 26, 2022, 11:52 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు సిద్ధమైంది. హామిల్టన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ ఆతిథ్య న్యూజిలాండ్‌తో తలపడనుంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే గబ్బర్ సేన మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు విజయంతో దూకుడు మీదున్న న్యూజిలాండ్ అదే జోరుతో సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది. 307 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేని టీమిండియా బౌలింగ్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అక్లాండ్ లాంటి చిన్న మైదానంలో ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. కచ్చితంగా ఆరు బౌలింగ్ ఆప్షన్లతో బరిలోకి దిగాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో వన్డేలో భారత జట్టు మార్పులతో బరిలోకి దిగాల్సి వచ్చింది. ఆరవ బౌలింగ్ ఎంపిక కోసం ఒక బ్యాటర్ పక్కన పెట్టాలి. దీపక్ హుడాను జట్టులోకి తీసుకుంటే శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని బెంచ్‌కే పరిమితం చేయాలి.


తొలి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ అసాధారణ ప్రదర్శన చేశాడు. సెంచరీకి చేరువగా వచ్చి ఔటయ్యాడు. అంతేకాదు వన్డే క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి ఆయనను పక్కన పెట్టే అవకాశం లేదు. సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా.. సూపర్ ఫామ్ లో ఉన్న అతడిని పక్కన పెట్టేందుకు టీమ్ మేనేజ్ మెంట్ సాహసించలేదు. తొలి వన్డేలో సంజూ శాంసన్ అద్భుతంగా ఆడకపోయినా, అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ దీపక్ హుడా కోసం జట్టు మేనేజ్‌మెంట్ అతన్ని పక్కన పెట్టే పరిస్థితిలో ఉంది. ఓపెనర్లుగా రాణించిన శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్‌లకు స్థానాలకు కూడా డోకా లేదు. నిలకడలేని ఫామ్ తో సతమతమవుతున్న రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా జట్టులో కొనసాగుతున్నాడు. కానీ టీ20 సిరీస్‌తో పాటు తొలి వన్డేలోనూ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడిని తప్పించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. దీపక్ హుడా కోసం టీమ్ మేనేజ్‌మెంట్ పంత్‌ను తప్పించే రిస్క్ తీసుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ పంత్ తప్పుకుంటే సంజూ శాంసన్ జట్టులో కొనసాగుతాడు. ఆరో స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ చోటుకు డోకా లేదు. బ్యాటింగ్‌లో అతను సత్తా చాటాడు. న్యూజిలాండ్‌లో మైదానాలన్నీ చిన్న మైదానాలు కావడంతో రిస్ట్ స్పిన్నర్లు తేలిపోతున్నారు. తొలి వన్డేలో చాహల్ ఒక్క వికెట్ తీయకపోగా.. దారుణంగా పరుగులిచ్చుకున్నాడు. హామిల్టన్ మైదానం కూడా చిన్నదే కావడంతో చాహల్‌ను పక్కనపెట్టి దీపక్ చాహర్‌ను తీసుకునే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల టీమిండియా బ్యాటింగ్ డెప్త్ కూడా పెరగనుంది. పేసర్లుగా ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్ ఆడటం ఖాయం. ఒకవేళ చాహల్‌ను కొనసాగించాలనుకుంటే శార్దూల్‌ను పక్కనపెట్టి చాహర్‌తో బరిలోకి దిగవచ్చు. కుల్దీప్‌ యాదవ్‌కు మాత్రం మరోసారి నిరాశ తప్పేలా లేదు.
తుది జట్టు(అంచనా): శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సంజూ శాంసన్/దీపక్ హుడా, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com