ఉన్నత చదువులు కొనసాగించే క్రమంలో చాలా మంది తమకు ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే బాధపడిపోతారు. పొరపాటుగా ఫెయిల్ అయితే క్రుంగిపోతారు. అయితే కేరళలోని అలప్పుజాకు చెందిన ఫైసల్ యూసఫ్ మాత్రం చింతించలేదు. 12వ తరగతి డ్రాపౌట్ అయిన ఆయన వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు. ఉపాధి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఎన్నో కష్టాలు పడిన స్టార్ట్-అప్ పెట్టి విజయవంతం అయ్యారు. ఎన్ని కష్టాలొచ్చినా లక్ష్యసాధన దిశగా ముందుకెళ్తే విజయం సాధించవచ్చనే సందేశాన్ని యువతకు అందిస్తున్నారు. ఆయన విజయగాథ గురించి తెలుసుకుందాం.
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగనిదే చాలా మందికి రోజు ప్రారంభం అవదు. అయితే 50 రకాలుకు పైగా విభిన్న రుచులు ఉన్న 'టీ'లను కేరళ నివాసి ఫైసల్ యూసఫ్ అందిస్తున్నారు. 2018లో అలప్పుజా లైట్ హౌస్ సమీపంలో ఆయన తన THE CHAI WALAH స్టాల్‌ను ప్రారంభించారు. క్రమంగా స్టార్టప్‌ను 50 ఫ్రాంఛైజీలుగా విస్తరించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఆయన ఔట్‌లెట్‌లు ఉన్నాయి. దీంతో పాటు మధ్యప్రాచ్య(అరబ్) దేశాల్లోనూ త్వరలో ఆయన తన ఫ్రాంఛైజీలను విస్తరించనున్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఫైసల్ చాలా కష్టాలు పడ్డాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఫైసల్ అలప్పుజలోని ఓ అనాథాశ్రమంలో పెరిగాడు. చదువుపై ఆసక్తి లేకపోవడంతో 12వ తరగతిలోనే డ్రాపౌట్‌గా మిగిలాడు. ఆ తర్వాత పేపర్ బోయ్‌గా పని చేశాడు. తన బాస్ అనుకోకుండా చనిపోవడంతో ఆ వార్తా సంస్థను తన ఆధీనంలోకి తీసుకుని కొన్ని నెలలపాటు నడిపించాడు. దాని వల్ల వచ్చే ఆదాయం తక్కువగా ఉండడంతో ఆ పని వదిలేశాడు. తర్వాత ఫైసల్ కొన్ని మార్కెటింగ్ ఉద్యోగాలను చేపట్టాడు. దేశంలోనూ, విదేశాల్లోనూ ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాడు. ఇంగ్లండ్ పర్యటన అతని జీవితంలో ఒక మలుపుగా మారింది.
ఫైసల్ ఇంగ్లాండ్‌లో సుమారు 10 సంవత్సరాలు ఫుడ్ & బేవరేజెస్ పరిశ్రమలో పనిచేశాను. ఆ అనుభవంతో THE CHAI WALAH స్టార్ట్-అప్‌ను ప్రారంభించాడు. ఇది ఆయన నాలుగేళ్ల పరిశోధన, ప్రయోగాల ఫలితంగా ఏర్పడింది. దేశంలో ఎక్కడ చూసినా టీ స్టాళ్లు ఉంటాయని, ఈ వ్యాపారం తగినది కాదని ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు పెదవి విరిచారు. అయితే తాను ఈ రంగంలో విజయం సాధించగలనని ఫైసల్ విశ్వసించాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. చివరికి అనుకున్నది సాధించాడు. కనీసం తనకు టీ కాచుకోవడం కూడా తెలియదని, అయినా పట్టుదలతో ఎన్నో విషయాలు తెలుసుకున్నానని పేర్కొన్నాడు. 'ది చాయ్ వాలా' ప్రతి స్టాల్‌లో కనీసం 50 రకాల టీ, కాఫీ, జ్యూస్‌లు, స్నాక్స్‌లను విక్రయిస్తారు. స్టాల్‌కు నలుపు, తెలుపు రంగులు వేయబడ్డాయి. 'ది చాయ్ వాలా'ను ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు కేరళలో ఇలాంటి టీ దుకాణాలు చాలా వచ్చాయని ఫైసల్ తెలిపారు. తాను ఒక ట్రెండ్‌ను ప్రారంభించడం గర్వంగా ఉందని తెలియజేశారు.
'ది చాయ్ వాలా' మెనూలో ఎక్కువ మంది ఇష్టపడేది ఇండియన్ మసాలా చాయ్. ఇది దేశవ్యాప్తంగా రైతుల నుండి నేరుగా సేకరించిన 12 సుగంధాలను కలిగి ఉంటుంది. అస్సాం, నీలగిరి పర్వత శ్రేణుల నుండి వచ్చిన అత్యుత్తమ బ్లాక్ టీ కలయిక. తమ ప్రతి ఔట్‌లెట్‌లో ఇది ఎంతో మందికి ఫేవరెట్ అని ఆయన చెప్పారు. ఇవే కాకుండా పుదీనా ఛాయ్, తులసి ఛాయ్, హోలీ బాసిల్ ఛాయ్, పాన్, కుంకుమపువ్వు ఛాయ్, కడక్ ఛాయ్, ది చాయ్, ఐస్‌డ్ మసాలా చాయ్ వంటివి తమ స్టాళ్లలో లభిస్తాయని ఫైసల్ వివరించారు. ఒక్కో కప్పు ధర రూ.15 నుంచి మొదలై రూ.80 వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ 'ది చాయ్ వాలా' చక్కని రుచులు గల టీలతో పాటు పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ విషయంలో తాము రాజీ పడబోమని ఫైసల్ చెబుతున్నారు.
టీ మిశ్రమాలను కూడా స్టాల్‌లో విడిగా విక్రయిస్తారు. ఇతర బృందంతో కలిసి త్వరలో వాటిని రిటైల్ విక్రయాలు చేయాలని ఫైసల్ ఆలోచిస్తున్నాడు. ప్రారంభించిన తొలినాళ్లలో స్టాల్స్ ఫ్రాంచైజ్ మోడల్‌లో పనిచేశాయి. వీటి సంఖ్య బాగా విస్తరించింది. కానీ వాటిలో చాలా వరకు సరిగ్గా పనిచేయడం లేదని, వారి స్వంత పద్ధతులను అవలంబిస్తున్నారని ఫైసల్ తెలుసుకున్నాడు. పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు, ఫ్రాంచైజ్ స్టాల్స్ అన్నీ పక్కా ప్రణాళికతో చక్కటి రుచులు గల 'టీ'లను ఆయన అందిస్తున్నారు. ఇప్పుడు మాతృ సంస్థ నోమాడిక్ టేస్ట్‌బడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన బెంగళూరులో ఏర్పాటు చేయనున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లలోనూ స్టాళ్లను 1000కి పెంచడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఖతార్, ఒమన్, బహ్రెయిన్, యూఏఈలలో తన వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఆయన ఉన్నారు. యూరోపియన్ దేశాలలోనూ అక్కడి ప్రజల అభిరుచికి తగ్గట్టు టీలను అందించడానికి కృషి చేస్తున్నాడు. చిన్న పేపర్ బోయ్‌గా ప్రస్థానం ప్రారంభించి, వ్యాపారవేత్తగా ఫైసల్ ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. జీవితంలో ఏదైనా సాధించాలనే ఆశను కల్పిస్తోంది.